ఈ కాలం చాలా మందికి వెన్ను నొప్పి సర్వసాధారణమయ్యింది. ఆధునిక జీవనంలో శారీరక శ్రమ లేకపోవడం, ఉద్యోగరీత్యా అధిక సమయం కూర్చునే ఉండడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరు వెన్నునొప్పి వేధిస్తోంది. ఇది చాలా మందికి చికాకు కల్గిస్తోంది. దీనికి మార్గమేమిటాని ఆలోచిస్తున్నారు. చాలా మంది మందులు, మాకులు తిని నడుం నొప్పి పోగొట్టుకోవడాని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే దీనిని చిన్నచిన్న వ్యాయామాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
వెన్ను వ్యాయామాలు చేసేటప్పుడు రెండు ఎక్సర్‌సైజుల మధ్య కొంత విశ్రాంతి తీసుకోవాలి. మెడ వ్యాయామాలకు ఈ అవసరం లేదు. ప్రతిరోజూ అల్పాహారానికి ముందు, రాత్రి భోజనానికి ముందు రెండుస్లారు ఈ వ్యాయామాలు చేస్తే వెన్ను, మెడనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
చదునైన నేలపై ముందుగా వెల్లకిలా పడుకోవాలి. కాళ్లు రెండూ పైకి ఎత్తి మోకాలి దగ్గర లంబకోణంలో వంచాలి. నిదానంగా నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ దించుతూ ఉండాలి. ఇలా ఆరుసార్లు చేయాలి. రోజూ ఈ వ్యాయామం చేస్తే నడుము ఎముకలు పటిష్టం అవుతాయి.
అదే విధంగా కాళ్ళను వంచి అరచేతులను తల కింద ఆనించాలి. ఇప్పుడు పాదాలను కదిలించకుండా మోకాళ్లను మాత్రమే కుడివైపు వంచి నేలకు ఆనించాలి. తరువాత ఎడమవైపు నేలకు ఆనించాలి. ఇలా ఆరుసార్లు చేస్తే వెన్నుతో పాటు నడము కండరాలు కూడా గట్టిపడతాయి.
బోర్లా పడుకోవాలి. మోచేతులను పైకి లేపి అరచేతులను ఛాతి పక్కన ఉంచాలి. గెడ్డం భాగం నేలకు ఆనించాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మెల్లగా అరచేతులపై బలం ఉంచి మెడ, తల, ఛాతి భాగాలను ఒక్కొక్కటిగా పైకి లేపాలి. అర నిమిషం పాటు పైకి అలా చూస్తూ ఉండండి. ఈ వ్యాయామం వల్ల వెన్ను, మెడ కండరాలు దృఢంగా తయారవుతాయి.
చేతులను నిటారుగా పొట్టకిందకి చేర్చాలి. బోర్లా పడుకుని గెడ్డం నేలకు ఆనేలా తలను ఎత్తి పెట్టాలి. ఇప్పుడు మెల్లగా ఒక కాలును నిదానంగా వీలైనంత ఎత్తుకు లేపాలి. ఇలా పైకి లేపేటప్పుడు మోకాళ్లు వంచకూడదు. ఒక్కో కాలుతో మూడు సార్లు ఇలా చేయాలి.
Comments
Post a Comment