కొన్ని గంటల పాటు కూర్చున్న చోట నుంచి లేవకుండా పనిచేయడం, అదేపనిగా నిల్చుని పనిచేయడం.. వీటివల్ల నడుం కింద భాగంలో కొవ్వు పేరుకుపోవడం, మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులూ వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటివి అదుపులో ఉంచాలంటే నటరాజాసనం, వాయు ముద్ర, సమతులాసనం ట్రై చేయండి.
1. నటరాజాసనం:
నిలబడి చేత్తో గోడను ఆసరాగా తీసుకుని కుడి మోకాలిని వెనక్కి మడిచి సాధ్యమైనంతవరకు పైకి లేపాలి. అరనిమిషం నుంచి నిమిషం వరకూ ఉండాలి. ఇలానే ఎడమకాలితో కూడా చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల కీళ్లనొప్పుల సమస్య ఉన్నవారికి తక్షణ ఉపశమనం దొరుకుతుంది.
2. వాయుముద్ర :
సుఖాసనంలో కూర్చుని చూపుడు వేలిని మడిచి దానిపైన బొటనవేలిని ఉంచాలి. తక్కిన వేళ్లను నిటారుగా ఉంచాలి. ఇదే వాయుముద్ర వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లుమూసుకొని శ్వాస తీసుకోవాలి. గాలిని వదిలేస్తున్నప్పుడు నొప్పులను బయటకు వదులుతున్నట్టుదా భావించాలి.
ఈ ముద్రలో పావుగంట పాటు ఉండొచ్చు. కీళ్ళనొప్పులు ఉన్నవారు రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు ఐదునిమిషాల పాటు ఈ ముద్రవేయాలి. నొప్పులు తగ్గిన తర్వాత ఈ ముద్ర వేయడం మానేయాలి.
3. సమతులాసనం :
ముందుగా నిలబడి కుడిమోకాలిని వెనక్కి మడిచి కుడిపాదాన్ని కుడిచేత్తో పట్టుకోవాలి. రెండు మోకాళ్లు పక్కపక్కనే పెట్టుకోవాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని పైకి నిటారుగా ఉంచాలి. శ్వాస మాములుగా తీసుకొని వదులుతూ ఉండాలి.
ఇలా అర నిమిషం నుంచి నిమిషం వరకూ ఉండాలి. మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు చేతిని గోడకు ఆనుకొని చేయొచ్చు. ఆ ఆసనం చేయడం వల్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. కండరాలు బలపడతాయి.
Comments
Post a Comment